Air Pollution
భారతదేశంలో గాలి కాలుష్యం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈ కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. శీతాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలి కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా శ్వాసకోస సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అవి ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు.
Vehicles Ban in మహారాష్ట్ర
గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించాలని దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుధీర్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌పై ప్రత్యేక దృష్టి
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో (ఎమ్మ్ఎంఆర్) కేవలం సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రీజియన్‌లో ముంబైతో పాటు థానే, రాయ్‌గఢ్, పాల్ఘర్ జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ కమిటీ గాలి కాలుష్యం సమస్యపై అధ్యయనం చేసి, మూడు నెలల్లో నివేదికను సమర్పించాల్సిందిగా ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.
బాంబే హైకోర్టు వ్యాఖ్యలు
ఈ నెల 9వ తేదీన ముంబైలో గాలి కాలుష్యంపై బాంబే హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. విచారణ సమయంలో హైకోర్టు, వాహనాల నుంచి ఉద్గారాలు (ఎమిషన్స్) గాలి కాలుష్యానికి ప్రధాన కారణమని స్పష్టం చేసింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సరిపోవని తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సూచనలతో మోటివేట్ అయిన మహారాష్ట్ర ప్రభుత్వం, పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధించే అవకాశం పరిశీలిస్తోంది.
గాలి కాలుష్యాన్ని తగ్గించే దిశగా కీలక అడుగు
ఈ నిషేధం ద్వారా ముంబై నగరంలో వాహనాల ఉద్గారాల వల్ల వచ్చే కాలుష్యాన్ని తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడమే లక్ష్యంగా మహారాష్ట్ర సర్కార్ ముందుకెళ్తోంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, దేశంలోని ఇతర నగరాలకు కూడా ఇది ఆదర్శంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కీలక నిర్ణయం, ప్రజల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని ఆశిద్దాం.