KCR సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు KCR సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కొడితే మామూలుగా కాదు, గట్టిగా కొట్టడం తన అలవాటు అని స్పష్టం చేశారు. జహీరాబాద్ బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు
కేసీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, గంభీరంగా, మౌనంగా ప్రభుత్వం పనితీరును పరిశీలిస్తున్నానని తెలిపారు. ఎన్నో ప్రభుత్వాలను చూశానని, అయితే ఇలాంటి పరిపాలనను ఇంతకు ముందు చూడలేదని వ్యాఖ్యానించారు. ఏడాది కంటే ముందే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, కాంగ్రెస్ నాయకులను చూసిన ప్రజలు కోపంతో ఉన్నారని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఆరోపణలు
బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కావాలని ప్రజలు ఓటు వేసినప్పటికీ, కాంగ్రెస్ పాలకులు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించారని ఆరోపించారు. గురుకులాల్లో విద్యావ్యవస్థ సరిగా లేకుండా పోయిందని, విద్యార్థులకు తిన్నదగిన భోజనం కూడా అందడం లేదని మండిపడ్డారు. తాను చెప్పినా ప్రజలు వినలేదని, అధిక ఆశతో కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. రైతుబంధు, దళితబంధు లాంటి పథకాలకు కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించిందని గుర్తు చేశారు.
ప్రజా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు
“రాబోయే రోజుల్లో విజయం మనదే” అని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్, తెలంగాణ ప్రజల విజయం కోసం బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోరాటం లేకుండా ఈ ప్రభుత్వం దిగిపోదని, ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, అందరూ తరలి రావాలని కోరారు.
ప్రాజెక్టుల నిర్లక్షంపై ఆగ్రహం
కాంగ్రెస్ పాలనలో భూముల ధరలు పడిపోవడంతో పాటు రాష్ట్రంలోని ప్రాజెక్టులు కూడా నిలిచిపోయాయని కేసీఆర్ ఆరోపించారు. సంగమేశ్వర, బసవేశ్వర, కాళేశ్వరం ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని తీవ్రంగా విమర్శించారు. ప్రాజెక్టుల అభివృద్ధికి బదులుగా అవి ఎండిపోయేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని, ప్రజలు నిజమైన పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
ఫామ్ హౌస్ గురించి కాంగ్రెస్ నేతలు బద్నాం చేస్తున్నారని, అసలు ఫామ్ హౌస్‌లో పంటలు తప్ప ఇంకేం ఉంటాయని ప్రశ్నించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను ఉపయోగించుకుంటోందని, సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల టెండర్లు ఎందుకు పిలవలేదని నిలదీశారు. పాలనా వైఫల్యాలను ప్రశ్నించిన ప్రతిసారి కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ధ్వజమెత్తారు.
సంఘటితంగా ముందుకు సాగితేనే బీఆర్‌ఎస్ విజయాన్ని సాధిస్తుందన్న కేసీఆర్, ప్రజా పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.