Mlc Kavitha: కేసీఆర్ లేకుంటే నల్గొండ లిల్లీపుట్ ఎవరు?: ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కవిత సొంత పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్రలు చేస్తున్నది ఒక పెద్ద బీఆర్ఎస్ నాయకుడేనని ఆమె తీవ్రంగా ఆరోపించారు. సొంత పార్టీ ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరూ స్పందించలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నల్గొండ జిల్లాకు చెందిన ఒక నాయకుడిని ‘లిల్లీపుట్’ నేతగా పేర్కొంటూ, పార్టీ ఓటమికి ఆయనే కారణమని ధ్వజమెత్తారు. “కేసీఆర్ లేకపోతే ఆ లిల్లీపుట్ నేతకు విలువ ఏముంటుంది? నన్ను విమర్శించే ముందు ఆయన తన స్థానం గురించి ఆలోచించుకోవాలి” అని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు.
రాజకీయ కుట్రపై ప్రశ్నలు
తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు ఎలా లీకైందో తనకు తెలియదని, ఆ లీకేజీ వెనుక ఉన్నది ఎవరు అని ఆమె ప్రశ్నించారు. ఇది తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమేనని పరోక్షంగా పేర్కొన్నారు.
భాజపా ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యలపై కూడా కవిత స్పందించారు. “ఆయన నాకు తెలుసు కానీ, గత ఆరు నెలలుగా మా మధ్య ఎలాంటి సంభాషణలు జరగలేదు. ఆయన ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు” అని స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్లపై దీక్ష
ప్రభుత్వం లేదా కోర్టు అనుమతి ఇవ్వకపోతే, తాను ఇంటి నుంచే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగిస్తానని కవిత ప్రకటించారు. తన వెనుక ప్రభుత్వం ఉందంటూ వస్తున్న ఆరోపణలను ఆమె గట్టిగా ఖండించారు. “మ్యాచ్ ఫిక్సింగ్ చేసే వాళ్లే ఇలాంటి ఆరోపణలు చేస్తారు” అంటూ కవిత సమాధానమిచ్చారు.