Washington D.C.: అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంలో “అమెరికా ఫస్ట్” అనేది తన ప్రధాన నినాదమని పునరుద్ఘాటించారు. అమెరికా ప్రజల కోసం సేవ చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ, “అమెరికా ఇప్పుడు కొత్త స్వర్ణయుగం వైపు అడుగులు వేస్తోంది. గతంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నా, దేశం మరింత శక్తివంతంగా ముందుకు సాగింది. మీరు ఇచ్చిన మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతి చిన్న సమస్యను కూడా పరిష్కరించగల ప్రభుత్వం రూపుదిద్దుకుంటోంది” అన్నారు.
శాంతి భద్రతలపై దృష్టి
ట్రంప్ తన ప్రసంగంలో దేశ భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. “అక్రమ వలసలను అడ్డుకుంటాం. విదేశీ ఉగ్రవాద సంస్థలను పూర్తిగా నిర్మూలిస్తాం. న్యాయవ్యవస్థను పటిష్టం చేసి, శాంతిని కాపాడతాం. విద్యా వ్యవస్థలో కీలకమైన మార్పులను తీసుకువస్తాం. 2025 వరకు అమెరికా పూర్తి స్వేచ్ఛాయుత దేశంగా మారుతుంది” అని ఆయన తెలిపారు.
భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రమాణ స్వీకారం
వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ రోటండాలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేయగా, ఆ తర్వాత ట్రంప్ తన ప్రమాణాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమం కోసం 25,000 మందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం విశేషం. కార్యక్రమానికి భారత్ నుంచి విదేశాంగ మంత్రి జై శంకర్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాధినేతలు హాజరయ్యారు.
వాషింగ్టన్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రమాణ స్వీకార వేడుక సందర్భంగా వాషింగ్టన్ డీసీలో రహదారుల మూసివేతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మెట్రో సేవలను కూడా తాత్కాలికంగా మళ్లించారు.
ట్రంప్ నాయకత్వంలో అమెరికా మరింత శక్తివంతమైన, ఆత్మనిర్భరమైన దేశంగా ఎదగడం ఖాయమని ఆయన ప్రసంగం ద్వారా స్పష్టమైంది.